సగటు స్త్రీ రూపం !(మొదటి కవిత -అతివ -అంతర్మధనం)
జీవన సమర ప్రాంగణంలో
అను నిత్యం సంగ్రామం
భళ్ళుమని పగిలిన విస్పోటం
రెక్కలు తెగిన పక్షి అరుపు
కోరలు చాచిన మిన్నాగు బుస బుసలు
కరడు కట్టిన మానవత్వం
అంచనాకందని భీభత్సం
భయానకం, రౌద్రం, రణరంగం
కలగలిసిన క్షతగాత్రం
విర్రవీగిన యవ్వన జ్వలితం
ఇగిరిపోయిన కారుణ్యం
అణచి పెట్టబడిన అభిమానం
విరిగి పోయిన జీవన విపంచి
అశ్రుసిక్తమైన రక్తసింధూరం
ముక్తాయింపు కూడా నోచుకోని కొంగు బంగారం
ప్రత్యక్ష పున్నమ నరకమైన మాతృత్వం
ఆత్మ గౌరవపు గోడలకు
అతుక్కుపోయిన సంప్రదాయం
ముక్కలై రాలిపడే పూర్వ స్మృతులు
ప్రజ్వరిల్లుతున్న సజీవ ఆత్మ దహనం
అసహాయత, ఆవేదన, ఆరాటం
కరిగిపోతున్న విచిత్ర ఆకృతి
వెరసి నిలిచిన మూర్తి
ఇదే కదా నేటి స్త్రీ రూపం ......?
Labels: సగటు స్త్రీ రూపం


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home